సమంత కొత్త సినిమా యశోద రెగ్యులర్ షూటింగ్ షురూ

నాగ చైతన్య నుంచి విడిపోయాక సమంత కొన్ని రోజులు చాలా బాధపడినప్పటికీ దాని నుంచి ఆమె చాలా త్వరగానే కోలుకొన్నారు. మొదట పుష్పలో ప్రత్యేక గీతం తరువాత హాలీవుడ్ మూవీ ‘ఆరెంజ్‌ మెంట్స్ ఆఫ్ లవ్’ సినిమాకు సైన్ చేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాను పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త సినిమాకు ఒప్పుకొన్నారు. 

దీనిని శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. నిన్న హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సమంత మాత్రమే చేయగలిగిన లేడీ ఓరియంటడ్ మూవీ ఇది. దీనికి ‘యశోద’ అని పేరు ఖరారు చేశాము. థ్రిల్లర్ జానర్‌లో తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మించబోతున్నాము. దీనికి హరి-హరీష్ దర్శకత్వం వహించనున్నారు. పూజా కార్యక్రమాలవగానే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాము. మార్చిలోగా షూటింగ్ పూర్తి చేస్తాం. యశోద తెలుగు వెర్షన్‌కు మణిశర్మ సంగీతం, ఎం.సుకుమార్ కెమెరా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, డా.చల్లా భాగ్యలక్ష్మి, చిన్న నారాయణ మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు అందిస్తారు. మిగిలిన భాషలలో టెక్నీషియన్స్, నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం,” అని చెప్పారు.