కన్నడ నటుడు శివరాం మృతి

ప్రముఖ కన్నడ నటుడు శివరాం (83) శనివారం బెంగళూరులో తన నివాసంలో మరణించారు. ఈరోజు ఉదయం ఆయన దేవుడి పూజ చేసుకొంటుండగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకువెళ్ళినప్పటికీ ప్రాణం దక్కలేదు. బ్రెయిన్ హెమరేజ్‌ కారణంగా ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. 

శివరాం 1958లో కన్నడ సినీ రంగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రవేశించి 1965లో తొలిసారిగా బెరెత జీవ అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి క్యారెక్టర్ నటుడిగా అనేక సినిమాలు చేశారు. 1972లో హృదయ సంగమ అనే సినిమాకు స్వయంగా దర్శకత్వం వహించారు. ఆ తరువాత అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు. అనేక సినిమాలు నిర్మించారు కూడా. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తమిళంలో ధర్మదురై అనే ఓ సినిమాను నిర్మించారు. 

 ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌ ఆకస్మిక మరణంతో ఇంకా తేరుకోక మునుపే కన్నడ సినీ పరిశ్రమకు శివరాం మరణంతో మరో షాక్ తగిలినట్లయింది. ఆయన మృతిపట్ల కన్నడ సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేస్తోంది.