
ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. ఇటీవల ఆయనకు న్యూమోనియా సోకడంతో హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ ఈరోజు సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు.
కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన సిరివెన్నెల చిత్రంతో ఆయన సినీ పరిశ్రమలో పాటల ప్రస్థానం మొలైంది. ఆ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అవడంతో అప్పటి నుంచే ఆయన ఇంటి పేరు చెంబోలుకు బదులు సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ప్రసిద్ధి చెందారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి స్వస్థలం విశాఖ జిల్లాలోని అనకాపల్లి. దిగువ మద్యతరగతి కుటుంబంలో జన్మించిన బీఏ పూర్తి చేసిన తరువాత కుటుంబ బాధ్యతలు భుజానికెత్తుకొని బీఎస్ఎన్ఎల్‌లో చేరారు. పడవ తరగతి నుంచే సిరివెన్నెల సీతారామశాస్త్రి కవితలల్లుతుండేవారు. తరచూ సాహితీ సభలకు హాజరవుతుండేవారు. ఆ విదంగా దర్శకుడు కె.విశ్వనాథ్ దృష్టిలో పడటం ఆయన అదృష్టం. తెలుగు ప్రేక్షకుల అదృష్టం కూడా. తొలిసినిమా సిరివెన్నెలకి ఆయన వ్రాసిన పాటలతోనే సీతారామ శాస్త్రి పేరు సినీ పరిశ్రమలో మారుమ్రోగిపోయింది. అప్పటి నుంచి సుమారు 800కు పైగా సినిమాలకు 3,000 పాటలు వ్రాశారు. వాటిలో శృతిలయలు, స్వర్ణ కమలం, స్వయం కృషి, ఆపద్బాంధవుడు, రుద్రవీణ, క్షణక్షణం, స్వాతి కిరాణం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, వర్షం, శుభలగ్నం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాలకు అద్భుతమైన పాటలు వ్రాశారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతీ పాట ఆణిముత్యమే అయ్యింది. ఆయన ప్రతిభకు గుర్తింపుగా సమైక్య రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం 1986,1987, 1988 సం.లలో వరుసగా నంది అవార్డులతో గౌరవించింది. కేంద్రప్రభుత్వం కూడా 2019లో పద్మశ్రీతో సన్మానించింది.
తన పాటలతో తెలుగు ప్రేక్షకులను ఈనేళ్ళుగా ఓలలాడించిన సిరివెన్నెల ఇకలేరు. ఆయన వ్రాసిన పాటలు మాత్రం కలకాలం తెలుగువారి హృదయాలలో మారుమ్రోగుతూనే ఉంటాయి.