
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సభాముఖంగానే తన విజ్ఞప్తిని తెలియచేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కుంటున్న సమస్యలని పరిష్కరించాల్ని ఇందుకు ప్రభుత్వాలు సహకరించాలని కోరారు చిరంజీవి.
మేము ఆశగా అడగట్లేదు.. అవసరానికి అడుగూన్నాం. అది మీరు ఒప్పుకోవాలని కోరుతున్నా అంటూ చిరు మాట్లాడిన విధానం అందరిని అలరించింది. కరోనా వేళ సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలన్ని ప్రస్తావించిన చిరు.. వాస్తవ పరిస్థితుల గురించి ఓపెన్ గా మాట్లాడారు. అంతేకాదు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏ విపత్తు వచ్చినా ముందు ఉండి సహాయక చర్యలు చేపట్టేది సిని పరిశ్రమ అని గుర్తు చేశారు చిరంజీవి. కరోనా కారణంగా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉందని.. ఇలాంటి టైం లో ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉందని అన్నారు మెగాస్టార్.
చిత్ర పరిశ్రమలో సక్సెస్ రేటు చాలా తక్కువ.. 10 నుండి 15 శాతం మాత్రమే ఉంటుంది. మహా అయితే 20 శాతం. ఆ మాత్రం దానికే ఇండస్ట్రీ పచ్చగా.. కళకళలాడుతుందని అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా కష్టాలు పడే వారున్నారు. రక్కాడితే కాని డొక్కాడని కార్మీకులు ఉన్నారు. వారంతా కలిస్తేనే చిత్ర పరిశ్రమ అని అన్నారు చిరు.
నలుగురు, ఐదుగురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు కలిస్తే ఇండస్ట్రీ కాదు. వీళ్లు బాగున్నారు కదా అని.. ఇండస్ట్రీ బాగుంది అనుకుంటే మెరిసేదంతా బంగారం కాదు. కరోనా టైం లో ఇది స్పష్టంగా కనిపించింది. నాలుగైదు నెలలుగా షూటింగ్ ఆగిపోయేసరికి కార్మీకులు చాలా ఇబ్బందులు పడ్డారు. హీరోలు, సినీ పెద్దలు, నిర్మాతలను అడిగి డబ్బులు పోగేసి కార్మీకుల కోసం నిత్యావసర సరుకులు అందించామని అన్నారు. పరిస్థితులు చక్కబడ్డాయి.. కానీ ఒక నెల షూటింగ్ లేకపోతే కార్మీకులు ఎంత ఇబ్బంది పడతారనే విషయాన్ని చెప్పటానికి ఇది ఉదహరణ అన్నారు.
లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ వేదికగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు తన వినతి చేస్తున్నా.. అనుకున్న స్థాయిలో ఆదాయం రాకపోవడానికి కారణం ఏంటి..? ఇంకా ఏం చేస్తే పరిశ్రమ బాగుంటుంది..? ఇలా అన్నిటినీ పరిగణలో తీసుకుని ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు మెగాస్టార్. కూరగాయలు ముందు చూసి తర్వాత కొంటాం.. కానీ ముందు కొనేసి ఆ తర్వాత చూసేది మాత్రం సినిమానే. మా మీద నమ్మకంతో మీరు సినిమాలు చూస్తున్నారు. చిరంజీవి ఉన్నాడంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయని మరో ఆలోచన లేకుండా థియేటర్ కు వస్తారు. మేం కూడా మీరు నిరాశకు గురి కాకుండా ప్రయత్నిస్తున్నాం ఈ కారణాల వల్ల వ్యయం పెరగొచ్చని అన్నారు. ప్రస్తుతం సినిమా పూర్తయ్యాక కూడా మరో సినిమా చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నామని.. ఆచార్య అయిపోయింది.. ఎప్పుడు రిలీజ్ చేయాలి..? ఎలా రిలీజ్ చేయాలి..? చేస్తే రెవిన్యూ వస్తుందా..? ఇలాంటి ప్రశ్నలు వెంటాడుతున్నాయని అన్నారు చిరు.
లవ్ స్టోరీ వేదికగా మీటింగులు, చర్చలు మాట అటుంచితే సినీ పరిశ్రమ బాగుండాలని అంటే.. ప్రభుత్వాలు పరిశ్రమని ఆదుకోవాలని.. టికెట్ల రేటు.. థియేటర్ల విషయంపై తగిన నిర్ణయాలు తీసుకోవాలని చిరు స్పీచ్ తో తన మనసులో మాటని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.