సినీరంగంలో కూడా సోనూసూద్ సేవాదృక్పదమే...గ్రేట్

బాలీవుడ్ నటుడు సోనూసూద్ సినీరంగంలోనే కాదు బయట నిజజీవితంలో కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపునేర్పరచుకొన్న గొప్ప వ్యక్తి. కరోనా...లాక్‌డౌన్‌ కష్టకాలంలో సర్వశక్తివంతమైన ప్రభుత్వాలు కూడా చేయలేని అనేక సహాయకార్యక్రమాలను ఆయనొక్కడే ఒంటిచేత్తో చేసి తపన, చిత్తశుద్ది ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించి చూపారు. ఆయన ఒక్కడే దేశంలో వేలాదిమంది నిసహాయులను, అభాగ్యులను ఆదుకొన్నాడు..ఎంతోమంది జీవితాలలో కొత్తవెలుగులు నింపాడు. అవన్నీ చూస్తున్నప్పుడు సోనూసూద్‌ ఓ నటుడిగా కంటే మానవతావాదిగానే ఎక్కువగా కనిపిస్తాడంటే అతిశయోక్తి కాదు. లాక్‌డౌన్‌ కష్టాలు పూర్తిగా తొలగిపోయినప్పటికీ నేటికీ ఆయన సహాయకార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తూనే ఉన్నారు.

ఒక సినీ నటుడిగా సినీరంగంలో తనకున్న అనుభవం, పరపతి, ఆర్జనలు కూడా అర్హులైనవారికి ఉపయోగపడాలని సోనూసూద్ కోరుకోవడం ఆయన విశాలహృదయానికి మరో నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దేశంలో చాలామంది రచయితలు, నటీనటులు, దర్శకులు, కళాకారులు సరైన గుర్తింపు, ప్రోత్సాహం, ఆర్ధికస్తోమత, పరిచాయలు లేక కనుమరుగైపోతుంటారు. అటువంటివారిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో సోనూసూద్ స్వయంగా సినీ నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. ముందుగా రచయితలను ప్రోత్సహించాలని భావిస్తున్న సోనూసూద్ సమాజానికి స్పూర్తిని, మంచి సందేశాన్నిచ్చే కధలతో ఎవరైనా ముందుకువస్తే వారికి అవకాశం కల్పిస్తానని చెప్పారు.