అంతరిక్షం అలా.. పడిలేచే మనసు ఇలా..!

శుక్రవారం వచ్చింది అంటే బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతుంటారు దర్శక నిర్మాతలు. ఎప్పటిలానే ఈ వారం రెండు తెలుగు సినిమాలు మరో రెండు డబ్బింగ్ సినిమాలు పోటీ పడ్డాయి. సినిమాల జాతకాలు తేలే శుక్రవారం ప్రేక్షకులకు చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇక నిన్న వచ్చిన రెండు తెలుగు సినిమాలు వరుణ్ తేజ్ అంతరిక్షం, శర్వానంద్ పడి పడి లేచె మనసు రిలీజ్ అవగా వీటితో పాటుగా కన్నడ యశ్ నటించిన కె.జి.ఎఫ్, కోలీవుడ్ ధనుష్ నటించిన మారి-2 వచ్చాయి.

అంతరిక్షం తెలుగు పరిశ్రమలో మరో గొప్ప ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. తెలుగులో వచ్చిన మొదటి స్పేస్ మూవీ అంతరిక్షం. వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను గొప్పగా తీశారు. అయితే సినిమాపై అంచనాలు ఎక్కువ ఉండటం వల్ల ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇక మొదటి రోజు ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో కేవలం 1.20 కోట్లను మాత్రమే రాబట్టింది.

ఇక శర్వానంద్, సాయి పల్లవిల పడి పడి లేచె మనసు కూడా మొదటి భాగం బాగానే నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ తేలగొట్టేశాడు. సినిమా సెకండ్ హాఫ్ మైనస్ అవడం వల్ల నిరాశ పరచింది. ఈ సినిమా తొలిరోజు 1.80 కోట్లు కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లో వసూళు చేసింది. శర్వానంద్ కెరియర్ లో ఫస్ట్ డే కలక్షన్స్ లో ఇది సెకండ్ స్థానంలో ఉంది.  

ఈ రెండిటితో పాటు వచ్చిన కె.జి.ఎఫ్, మారి-2లు కూడా పెద్దగా ప్రభావితం చూపించలేదు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో కన్నడ పరిశ్రమలోనే భారీ బడ్జెట్ మూవీగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 అక్కడ హిట్ టాక్ తెచ్చుకోగా తెలుగు ఆడియెన్స్ ను పెద్దగా మెప్పించలేదు. ఇక మారి-2 రెగ్యులర్ మాస్ మూవీగా వచ్చింది. ఈ సినిమా బి, సి సెంటర్స్ లో పర్వాలేదు అనిపించుకుంది.   

మొత్తానికి నాలుగు సినిమాల బాక్సాఫీస్ రేసులో ఏ సినిమా అంత గొప్పగా కలక్షన్స్ రాబట్టలేదు. అయితే వీకెండ్ కల్లా ఏమన్నా పరిస్థితి మారే అవకాశం ఉండొచ్చు.