
ఎవడే సుబ్రమణ్యం సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ రెండో ప్రయత్నంగానే సావిత్రి బయోపిక్ తీశారు. ఇక ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలు చూస్తేనే అర్ధమవుతుంది సినిమా ఏ రేంజ్లో తెరకెక్కించారో అని. అశ్వనిదత్ ప్రొడక్షన్ లో స్వప్నా దత్, ప్రియాంకా దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చూసిన రాజమౌళి సినిమా గురించి ఆర్టిస్టు పర్ఫార్మెన్స్ గురించి ట్వీట్ చేశాడు.
ఇక ఈమధ్యనే మహానటి టీంను అల్లు ఫ్యామిలీ సత్కరించింది. అందులో భాగంగా రాజమౌళి కీరవాణితో సహా కొందరు దర్శక నిర్మాతలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారట. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ సావిత్రి బయోపిక్ తీస్తున్నారంటే అంచనాలేమి లేవని సినిమా ఆడుతుందో లేదో అనుకున్నానని కాని అంచనాలను మించి సినిమా తీశారని అన్నాడట రాజమౌళి.
సినిమాలో ప్రతి ఒక్క పాత్ర చాలా అద్భుతంగా పండించాడని దానికి దర్శకుడి ప్రతిభే కారణమని అన్నాడట. అంతేకాదు నాగ్ అశ్విన్ ను చూస్తే తనకు అసూయ కలుగుతుందని తనలా ఈ బయోపిక్ తాను కూడా తీయలేనని అన్నాడట జక్కన్న. బాహుబలి లాంటి అద్భుతమైన సినిమా తీసి ప్రపంచ దేశాలకు తెలుగు సినిమా స్థాయిని తెలియచేసిన రాజమౌళి నుండి అసూయ, నా వల్ల కాదు అన్న మాటలు రావడం గొప్ప విషయం. మహానటి సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచే సినిమా అని అన్నారు రాజమౌళి.