సుకుమార్ (కొన్ని క్షణాలు) అశ్విన్ అయితే..!

మహానటి సావిత్రి జీవితాన్ని సినిమాగా తెరరూపానికి నాంది పలికిన నాగ్ అశ్విన్ కు ప్రముఖ దర్శకుడు సుకుమార్ రాసిన ఓ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి నాగ్ అశ్విన్ కు ఫోన్ చేద్దామనుకునేలోపే ఓ ఆవిడ వచ్చి నువ్వు దర్శకుడిగా బాబు అన్నదట. అవనని చెప్పేసరికి తనని గట్టిగా పట్టుకుని బాగా ఏడ్చేసి ఎంత బాగా చూపించావో బాబు మా సావిత్రమ్మని అనేసిందట.

నా కళ్లల్లో నీళ్లు.. నేను నువ్వు కాదని ఆమెకు చెప్పలేకపోయాను. ఆవిడ ప్రేమంతా నేనే తీసుకున్నాను. ఆవిడ మనసారా నన్ను దీవించి వెళ్లింది. కొన్ని క్షణాలు నువ్వే నేనైపోయాను ఆనందంతో.. ఇంతకన్నా ఈ సినిమా గురించి నేను ఏం చెప్తాను. ఆవిడకి ఎప్పటికి నేను అశ్విన్ ను కాదని తెలియకపోతే బాగుండు అంటూ చివరగా సుకుమార్ సైన్ తో బ్రాకెట్ లో కొన్ని క్షణాల అశ్విన్ అని లెటర్ రాశాడు సుకుమార్.  



ఈ లెటర్ పంపించినందుకు తప్పకుండా సుకుమార్ ను కూడా అభినందించాల్సిందే. ఎదుటి దర్శకుడి గొప్పతనం తన మాటలతో చెప్పి ఆయనకు మరింత ఖ్యాతి వచ్చేలా చేశాడు. ఈమధ్యనే రంగస్థలం సినిమాతో కెరియర్ లో క్రేజీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సుకుమార్.