హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత

హాస్యనటుడు గుండు హనుమంతరావు ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన స్వగృహంలోనే తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన ఈమధ్యనే ఆపరేషన్ చేయించుకున్నా సరే ఆరోగ్యం కుదుటపడలేదు. చివరి రోజుల్లో ఆర్ధీకంగా బాగా చితికిపోయిన గుండు హనుమంతరావుకి ఆపరేషన్ ఖర్చులకు మెగాస్టార్ చిరంజీవి, మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఆర్ధిక సహకారం అందించింది.

అయినా సరే అతన్ని కాపాడుకోలేకపోయాం. తన హాస్యంతో తెలుగు ప్రేక్షక హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గుండు హనుమంతరావు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అక్టోబర్ 10, 1956లో కాంతారావు, సరోజిని దంపతులకు జన్మించిన గుండు హనుమంతరావు జంధ్యాల అహ నా పెళ్లంట సినిమాతో మొదటిసారి అవకాశం అన్దుకున్నారు. తనదైన హావభావాలతో ప్రేక్షకులను అలరించారు. స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ రెండిటిలో తన కామెడీతో ఆకట్టుకున్న గుండు హనుమంతరావు వయసు మీద పడటంతో అన్నిటిని దూరం పెట్టాల్సి వచ్చింది. ఇక తీవ్ర అనారోగ్యం కూడా అతన్ని బాగా కుంగదీసింది. 2016లో శ్రీ సాయి సంకల్పం సినిమాలో చివరిగా నటించిన గుండు హనుమంతరావు సీరియల్స్ లో అడపాదడపా కనిపిస్తున్నారు. ఆయన మృతి పట్ల మా సభ్యులు గుండు కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియచేశారు.