
అలనాటి అందాల హీరోయిన్ కృష్ణకుమారి (83) బుధవారం ఉదయం బెంగళూరులో కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా వృద్దాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె అలనాటి అగ్రహీరోలందరితో కలిసి 110 తెలుగు సినిమాలలో నటించారు.
కృష్ణకుమారి రాజమండ్రికి చెందిన ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఆమె 1951లో ‘నవ్వితే నవరత్నాలు’ అనే సినిమాతో సినీ పరిశ్రమ లోకి ప్రవేశించారు. ఆ తరువాత పాతాళభైరవి, పిచ్చి పుల్లయ్య, ఇలవేల్పు, దీపావళి, పెళ్లి కానుక, భార్యాభర్తలు, కులగోత్రాలు, డాక్టర్ చక్రవర్తి చిలకాగోరింకా, మానవుడు దానవుడు, యశోద కృష్ణ, జ్యోతి మొదలైన అనేక హిట్ సినిమాలలో నటించారు. ఆమె అనేక తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించి మంచిపేరు తెచ్చుకొన్నారు. ప్రముఖ నటి ‘షావుకారు జానకి’ ఆమెకు స్వయాన్న అక్క. ఆమె కూడా అనేక తెలుగు, తమిళ సినిమాలలో హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.
కృష్ణకుమారి భర్త పేరు అజయ్ మోహన్ ఖైతాన్. బెంగళూరుకు చెందిన అయన ప్రముఖ ఇంగీష్ దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ గా చేశారు. ఆ తరువాత ‘బిజినెస్ మ్యాన్’,’ స్క్రీన్ మ్యాగజైన్’ అనే రెండు ఆంగ్ల మ్యాగజైన్లను స్థాపించి విజయవంతంగా నడిపించారు. ఆయనను వివాహం చేసుకొన్న తరువాత కృష్ణకుమారి సినీ పరిశ్రమ నుంచి నిష్క్రమించారు. ఆ దంపతులకు దీపిక అనే ఒక కుమార్తె ఉంది. ఇంతకాలం కృష్ణకుమారి వారివద్దే ఉన్నారు.