తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రతిసారీ విజయ దుంధుభి వాయిస్తుండడంతో, ఇక మిగతా పార్టీలకు కాలం చెల్లినట్లే అని విశ్లేషకులు తెలిపారు.
అదే విషయాన్ని నిజం చేస్తూ, గత కొంతకాలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనుండి, టీడిపీ నుండి, కాంగ్రెస్ నుండి, విపరీతంగా నాయకులు టీఆర్ఎస్ కు వలస పోతున్నారు. ఆ వరుసలో ఇప్పుడు ఎంపీ మల్లారెడ్డి కూడా చేరడం విశేషం. టీడీపీ నుండి పోటి చేసి, మల్కాజ్ గిరి ఎంపీగా గత కొంత కాలంగా కొనసాగుతున్న మల్లా, ఈ రోజు ఉదయం 11.30 నిమిషాలకు టీఆర్ఎస్ లో చేరారు. "రెండు పడకల గదులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ఎన్నో మంచి పధకాలు నన్ను టీఆర్ఎస్ వైపు ఆకర్షించాయి, అందుకే బంగారు తెలంగాణలో భాగస్వామ్యమవడానికి నిర్ణయించుకున్నాను", అని మల్లా తెలిపారు.
ఇరు తెలుగు రాష్ట్రాల ముఖమంత్రులు కెసిఆర్ మరియు చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్న నాయకులంటూ, మల్లా రెడ్డి కొనియాడారు. ఇప్పటికే తెలంగాణలో తన ఉనికిని ప్రశ్నించుకునే స్థాయిలో ఉన్న టీడీపీకి మల్లా దూరమవడం మరో గట్టి దెబ్బ అవుతుందని, ఇక ఈదెబ్బతో రాష్ట్రంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని విశ్లేషకులు తెలిపారు.