తెలంగాణలో డ్రీమ్‌వ‌ర్స్క్ ..

తెలంగాణలో వ్యాపార విస్తరణకు ప్రఖ్యాత హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ డ్రీమ్‌వర్క్స్ ఆసక్తి చూపింది. హైదరాబాద్‌లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎకో సిస్టమ్ థియేటర్‌ను నిర్మిస్తామని ప్రకటించింది. డ్రీమ్‌ప్లే అనే చిన్న తరహా థీమ్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు ఐదోరోజున లాస్ ఏంజిల్స్‌లోని డ్రీమ్‌వర్క్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సంస్థ సీఈవో జెఫ్రీ కాట్జన్‌బర్గ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలను జెఫ్రీకి కేటీఆర్ వివరించారు. భారత్‌లో సినిమా నిర్మాణానికి సంబంధించిన కార్యకలాపాలను విస్తరించే ఆలోచనలు ఉన్నాయన్న జెఫ్రీ.. సమర్థ నాయకత్వంలో ముందుకెళుతున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నామని చెప్పారు. 

తమ దీర్ఘకాలిక ప్రణాళికల అమలులో ప్రభుత్వ భాగస్వామ్యం కోరుతున్నామన్నారు. తమ సినిమాల ప్రమోషన్‌కోసం హైఎండ్ ఎకో సిస్టమ్‌తో ఒక థియేటర్ కూడా నిర్మిస్తామని, అందుకు సహకరించాలని మంత్రిని కోరారు. దీనికి స్పందించిన కేటీఆర్, చేతనైనంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో త్వరలో హైదరాబాద్‌లో నిర్మించే ఫిల్మ్‌సిటీ.. డ్రీమ్‌వర్క్స్ విస్తరణకు అత్యంత అనుకూలంగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఇక పర్యాటకులను ఆకర్షించేందుకు హైదరాబాద్‌లో డ్రీమ్ ప్లే అనే చిన్న తరహా థీమ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, డ్రీమ్‌వర్క్స్ ఈ సమావేశంలో నిర్ణయించాయి. భారత మార్కెట్ అవసరాలు, స్థానిక నైపుణ్యాన్ని పరిశీలించేందుకు హైదరాబాద్‌కు రావాలని జెఫ్రీని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు.

Video courtesy : T-News

- By Venkat