హోటల్స్ లో ఉండాల్సిన అవసరం లేకుండా, విదేశీ మరియు దేశీయ పర్యాటకులకు ఇక మీదట తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు అలవాటు చేయాలనే ఉద్దేశంతో, ఇక్కడి కుటుంబాల ఇళ్లలోనే బస చేసేలా, అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి 'హోం స్టే' అని పేరు కూడా పెట్టారు.
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ ఆలోచనతో ముందుకు రాగా, తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి, దానికి రూ 8 లక్షలు కేటాయించింది. ఈ స్కీం లో పాల్గొనడానికి, రాష్ట్రంలోని కుటుంబాల ఇళ్లలో, కనీసం ఐదు గదులు ఉండాలి. దానితో పాటు వారి పూర్తి వివరాలు- కుటుంబ సభ్యుల సంఖ్య, వారి పేర్లు, చదువులు, వాహనాలు (ఎవైనా ఉంటె), పడక గదులు మరియు బాత్ రూంల సంఖ్య, బస ఏర్పాట్లకు వాళ్ళ రేటు, ఇలా అన్ని వివరాలు అధికారులకు అందజేయాలి.
ఎంత డబ్బు తీసుకుంటున్నారు అనే దాని పై అధికారులు ఆంక్ష పెట్టలేదు. సౌకర్యాలు అన్ని సరిగ్గా ఉంటే, దాని ప్రకారంగానే వసూలు చేసుకోవచ్చు అనే చెప్పింది, అయితే పరిమితి దాటకుండా, కొంత నియంత్రణ మాత్రం ఉంటుంది అని రాష్ట్ర పర్యాటక శాఖలో ఒక అధికారి తెలిపారు.