తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.
ప్రభుత్వం చేపట్టే ఎన్నో అభివృద్ధి పనుల్లో సాగునీటి ప్రాజెక్టు అత్యంత కీలకమైన వాటిల్లో ఒకటి. అయితే గత కొంత కాలంగా ఆ పనుల నిర్వహణలో జాప్యం జరుగుతుండడం గమనించిన మంత్రి, ఇంజనీర్లపై మండిపడ్డారు. ఇంతకు ముందు చెప్పినట్టు కాకమ్మ కథలు చెప్తే వినే ఓపిక ప్రభుత్వానికి లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సహా, నీటిపారుదల ప్రాజెక్టుల పై అత్యంత సీరియస్ గా వ్యవహరించాలనుకుంటున్నారని, హరీష్ రావు తేల్చి చెప్పారు.
జూలై లోపు మహబూబ్ నగర్ లో 4.6 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించగలుగుతుంటే మిగతా జిల్లాలతో సమస్య ఎందుకొస్తుందో అర్ధం కావడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ లోపు, పనులు మొత్తం పూర్తి కావాలని లేకపోతే, పర్యావసనాలు చాలా తీవ్రంగా ఉంటాయని, హరీష్ రావు అధికారులను హెచ్చరించారు. "చూపు లేని వాళ్లకు కళ్ళు కావాలి, నాకు నీళ్ళు కావాలి, బుల్లెట్ దిగిందా లేదా" అని అంటూ, పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ మంత్రి గారు గుర్తు చేయడం అక్కడి అధికారులను ఆశ్చర్యపరిచింది.