తెలంగాణకు గుడ్ బై చెప్పనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్

2014 ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభంజనం తర్వాత, టీడీపీ, కాంగ్రెస్ లు తమ ఉనికిని పెద్దగా చాటుకోలేకపోయాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. తెలంగాణ రాష్ట్రంలో దుకాణం మూసేయాల్సిన సమయం వచ్చిందని పలువురు విశ్లేషకులు అన్నారు. అయినా సరే ధైర్యం చేసి రెండు మూడు సార్లు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై యుద్ధం ప్రకటించాలని చూసినా, అది జగన్ ను మరింత దిగాజార్చిందే తప్ప తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తుకు ఏ మాత్రం ఉపయోగ పడలేదు అనే వాదనలు వినిపించాయి. పార్టీ తెలంగాణ వింగ్ ఇప్పటికే మూసివేయగా, పార్టీ సమావేశాలు జరుపుకోవడానికి ఆఫీస్ అద్దెలు భరించలేక, హైదరాబాద్ లోని తన  లోటస్ పాండ్ నివాసంలోనే జరుపుకున్నారు.

ఇక మరోవైపు, తెలంగాణ లో తన ఆటలు కూడా సాగవు అని తెలుసుకున్న ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడీపీ కార్యకలాపాలన్నీ ఆంధ్రాకే షిఫ్ట్ చేస్తున్నారు. ఇది గమనించిన జగన్, ఆంధ్ర లో నైనా పార్టీ ని బలంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో విజయవాడ లోనే వైఎస్ఆర్సిపీ సంబంధించి అన్ని మీటింగులు పెట్టాలని నిర్ణయించారు. రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగితే జూన్ 6న, పార్టీ మొదటి మీటింగ్ అనుకున్నట్టే విజయవాడ లో ఉంటుంది అని సమాచారం.