యాపిల్ కంపనీ సిఈఓ టిమ్ కుక్, హైదరాబాద్ లో ఆపిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కాబోతోన్న సందర్భంలో హైదరాబాద్ కి యాపిల్ సెంటర్ రావడమనేది తెలంగాణ రాష్ట్ర ఐటీ చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు.
గురువారం జరిగిన ప్రారంభోత్సవంలో ఐటీ మంత్రి కెటీఆర్ ప్రసంగం అందరిని ఆకర్షించింది. టిమ్ కుక్ తో మాట్లాడాలనుకున్నపాయింట్లన్నీ చాలా చాకచక్యంగా మాట్లాడడంతో, కుక్ కూడా కెటీఆర్ ప్రసంగానికి ఆకర్షితులయ్యారు. ఐటీ మంత్రి తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాలు వివరించారు. రాష్ట్రంలో మరిన్ని యాపిల్ సెంటర్లు నెలకొల్పాలని, దానికి కావాల్సిన తోడ్పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ఇస్తుందని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం, యాపిల్ మంచి భాగస్వామ్యం తో ముందుకెళ్ళాలని, తద్వారా రాష్ట్రం తో పాటు, యాపిల్ కంపనీ కూడా అభివృద్ధి చెందుతుందని, కెటీఆర్ అన్నారు. తాజా కేంద్రం తో యాపిల్ కంపనీ కి, హైదరాబాద్ అతిపెద్ద టెక్ అభివృద్ధి కేంద్రంగా నిలవడం సంతోషకరమని మంత్రి అన్నారు.
ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్వీట్ లు పెడుతూ యాక్టివ్ గా ఉండే కెటీఆర్, కుక్ తో మీటింగ్ జరగబోయే రెండు రోజుల క్రితం నుండే, తొందరలో ఒక పెద్ద వార్త చెప్తాను అని ఒక ట్వీట్ పెట్టారు. ఆ విషయాన్ని కుక్ ముందు ప్రస్తావిస్తూ, ట్విట్టర్ లోని తన ఫాలోవర్లు, "వాట్ వాస్ కుకింగ్" అని అడుగుతున్నారు అని సభలో నవ్వులు పూయించారు. చివరగా రాష్ట్రంలో యాపిల్ తొలి అభివృద్ధి కేంద్రంలో పనిచేయడానికి వస్తున్న కొత్త ఉద్యోగులను కెటీఆర్ ఆహ్వానించారు.