కేసీఆర్ దమ్ముంటే కేసులు పెట్టు: బీజేపీ

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారం ఉందనే అహంకారంతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందన్న భయం కేసీఆర్‌కు పట్టుకుందన్నారు. పాలేరు ఉపఎన్నిక విజయానంతరం సీఎం కేసీఆర్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌పై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలోని విపక్షాలపై కేసులు పెడతామని కెసిఆర్ అన్న మాటలు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా దమ్ముంటే  కేసులు పెట్టండని సిఎంకు రాంచందర్‌రావు సవాల్ విసిరారు.   

నిన్న విడుదలైన పాలేరు ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ, బీజేపీ అధ్యక్షుడు కొత్తగా ఒకాయన వచ్చాడు. కొత్తబిచ్చగాడు పొద్దు గుర్తు ఎరుగడన్నట్లు ఆయన వైఖరి ఉందన్నారు.

కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్రం ఖర్చు చేయడం లేదని రాంచందర్‌రావు అన్న వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, తాగునీటికి కేంద్రం రూ.54 కోట్లు ఇస్తే.. రాష్ట్రం రూ.350 కోట్లు ఖర్చు చేసిందన్నారు. కరువు సాయం కింద రూ. 3వేల కోట్లు అడిగితే కేంద్రం రూ.750కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పారు కేసీఆర్. ఇలా కేంద్రం పై పెద్దగా ఆధార పడకుండా తమ పనులు తామే చేసుకుంటున్నామన్నారు. 

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, లాంటి తరహాలో ఏదైనా ఒక జాతీయ ప్రాజెక్టు సాధించుకొని రండి, అప్పుడు ప్రజలే మిమ్మల్ని నమ్ముతారు. అలా కాకుండా అర్ధం పర్ధం లేకుండా ఇలా ఆరోపణలు చేస్తే కేసులు పెట్టడమే కాకుండా, పరువు నష్టం దావా కూడా వేస్తామని సీఎం హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ వర్గాల్లోకలకలం సృష్టిస్తున్నాయి.