టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖమ్మ జిల్లాలోని పాలేరు నియోజక వర్గంకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన తుమ్మల నాగేశ్వర రావు ఘన విజయం సాధించారు.
తొలి రౌండ్ నుంచి అత్యధిక మెజార్టీ సాధించిన తుమ్మల, రౌండ్ రౌండ్ కి ఆ మెజార్టీని పెంచుకుంటుపోతూ కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి పై 45,650 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా తుమ్మల, మీడియా ముందు మాట్లాడుతూ, ఈ గెలుపు ముఖ్యమంత్రి కెసిఆర్ గారిదని, ఇప్పుడు బాధ్యత మరింత పెరిగిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి గారి అకాల మరణంతో జరిగిన ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో, ఆ కుటుంబం పై సానుభూతి తో వోట్లు రాలతాయి అనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుచరితా రెడ్డికి తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలికినప్పటికీ, ఆవిడ వెనుకంజ వేయక తప్పలేదు.
ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయ దుంధుభి వాయించిన టీఆర్ ఎస్, పాలేరులో కూడా ఆ విజయానికి మినహాయింపు కాదని మరోసారి రుజువు చేసింది, టీఆర్ ఎస్ పార్టీకి తెలంగాణ లో తిరుగులేదని, మిగతా పార్తీలు దుకాణాలు సర్దేసుకోవచ్చని చెప్పకనే చెప్పింది అని విశ్లేషకులు అంటున్నారు.