తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ద్వితీయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాదే కాక రాష్ట్రం మొత్తం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, పాఠశాలలు, హాస్పిటళ్లను అందంగా అలంకరించి, జూన్ 2న పండుగ వాతావరణం నెలకొల్పాలన్నారు. అదే రోజు వివిధ రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులను సత్కరించాలని, అమరవీరుల కుటుంబాలను సన్మానించాలని కెసిఆర్ అధికారులను ఆదేశించారు.
ఇందుకోసం కేసీఆర్ తన పార్టీ కార్యాలయంలో ఉత్సవాల ఏర్పాట్ల పైన సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చైర్మన్‌గా క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ఆవిర్భావ ద్వితీయ వార్షికోత్సవాల ఏర్పాట్ల గురించి చర్చించడానికి ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమయింది. ఇందులో కమిటీ చైర్మన్ నాయిని నర్సింహారెడ్డి, పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అమరవీరుల స్తూపాలను, తెలంగాణ తల్లి విగ్రహాలను అలంకరించడంతో పాటు, వైద్యశాలలు, అనాథ శరణాలయాల్లో పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి మాంసాహార భోజనం అందించాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
- ట్యాంక్‌బండ్‌పై జూన్ 2వ తేదీ రాత్రి పెద్ద ఎత్తున పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించాలి.
- రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ తో సహా, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ముఖ్య అధికారులు హైదరాబాద్ లో జరిగే ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో, ఆయా జిల్లాలకు చెందిన మంత్రి, కలెక్టర్, ఇతర ప్రముఖులు హాజరవుతారు.
- జిల్లాల్లోనిర్వహించే కార్యక్రమాల్లో అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించాలి. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని కూడా అతిథులుగా ఆహ్వానించాలి. రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 50మందికి, జిల్లా స్థాయిలో 25 మందికి జీవిత సాఫల్య పురస్కారాలు, అవార్డులు అందచేయాలి.
- రాష్ట్ర ఆవిర్భావం ఇతివృత్తంగా జిల్లా, డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో తెలుగు, ఉర్దూ భాషల్లో కవి సమ్మేళనాలు నిర్వహించాలి. స్కూళ్ళలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలి. అన్ని మతాల ప్రార్థనాస్థలాల్లో తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలి.