తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో హైదరాబాద్ కు కొత్త సచివాలయం ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. అయితే ఇటీవల ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సమయంలో, బుద్ధుడి వెనుక అంబేద్కర్ విగ్రహం, ఆయనకు ఎదురుగా సచివాలయం ఉంటే పరిపాలన బాగుంటుంది అని చెప్పడంతో సచివాలయం ఏర్పాటు లేనట్టే అనే అంతా అనుకున్నారు. కాని తాజా జీవోతో కొత్త సెక్రటేరియట్ భవనం పై ఊహాగానాలు మళ్ళీ మొదలయ్యాయి.
జీవో నంబర్ 172ను తాజాగా జారీ చేసి రాష్ట్రం లో కొన్ని కీలక నిర్మాణాలపై ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటుచేశారు. సచివాలయంతో పాటు ఇతర ఉన్నతాధికారుల క్వార్టర్లు - సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మాణాలపై సీఎస్ కమిటీ ప్రభుత్వానికి తగు సూచనలు చేయనుంది.
గతంలో జీవో నంబర్ 166ను విడుదల చేసి సెక్రటేరియట్ నిర్మించడానికి ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ దగ్గర 72 ఎకరాలు సెలెక్ట్ చేసుకున్నట్లు తెలిసిందే. కాని ఈలోపు రకరకాల కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఈ జీవోను పక్క పెట్టేశారు. ఐతే తాజా జీవో విడుదల, సెక్రటేరియట్ నిర్మిచాలనే ఆలోచనల్లోంచే పుట్టింది అని ఉన్నత వర్గాల సమాచారం. కాని సచివాలయం ఎక్కడ కట్టది అనేది మాత్రం ఇప్పటి వరకు ప్రస్తావించక పోవడం గమనార్హం. మరో వైపు, కెసిఆర్ ఇటీవలే సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్ కు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.