
బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ :
‘ప్రతి ఒక్కరూ స్వప్నం కనే సాహసం చేయాలి. ఆ స్వప్న సాకారానికి తగిన కార్యాచరణ రూపొందించుకుని పని చేయాల’ని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తాను 1996లో ఎస్సారెస్పీ వద్ద తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై ఆలోచించడం మొదలుపెట్టానని, తర్వాత నెమ్మదిగా కార్యాచరణ రూపొందించుకుని అమలు చేశానన్నారు. ప్రత్యేక ఉద్యమాన్ని ప్రారంభించినపుడు అవహేళన చేశారని, ఆటంకాలు ఎదురైనా లక్ష్యం వైపే సాగి విజయం సాధించానని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకెళ్లాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. బుధవారం తెరాస 15వ ఆవిర్భావదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మంలో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ప్రతీ ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో నల్లా నీరు ఇస్తామని పునరుద్ఘాటించారు.
ఈ ఏడాది డిసెంబరు నాటికి 6,200 గ్రామాలకు, 2017 డిసెంబరు నాటికి 95శాతం నివాసాలకు నీళ్లు ఇస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని, మున్నేరు, గోదావరి తదితరాలపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, రాబోయే మూడేళ్లలో ఖమ్మం ప్రజలు ఫలితాన్ని చూస్తారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూడాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళికలు వేశామన్నారు. రూ.35వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామంటూ, ఆసరా, రెండు పడక గదుల ఇళ్లు తదితర పథకాలను ప్రస్తావించారు. తమది మానవీయ కోణంలో ఆలోచించే ప్రభుత్వమని చెప్పారు. ఏ సమస్యకైనా మూలాల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొంటున్నామన్నారు.
2019 నాటికి తెలంగాణ రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తామన్నారు.