చిందులు తొక్కిన రేవంత్‌రెడ్డిని ఛేంజ్ చేసిన విషయాలేమిటి..?
మీసం మెలేసి... తొడగొట్టిన శాల్తీ ఇప్పుడు తలకిందకి వంచుకుని వెళుతోంది... ముఖ్యమంత్రీ నీ అంతుచూస్తా... అని చిందులు తొక్కిన నోరే ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. పోస్టర్లల్లో పులికి సీన్ మారి కాగితం పిల్లి అయిపోయింది. ఓటుకు నోటు కేసు నుంచి నిన్నమొన్నటిదాకా ఎగిరెగిరిపడ్డ రేవంత్‌రెడ్డి ఇప్పుడు చల్లబడిపోయినట్లు కనిపిస్తోంది. ఇంతకీ రేవంత్‌రెడ్డిలో ఈ సడన్ మార్పుకు కారణమేంటి..? ఇంతలా ఆయనను ఛేంజ్ చేసిన విషయాలేమిటి..?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మొత్తం ఖాళీ అయిపోయి ఇద్దరు ఎమ్మెల్యేలకు వచ్చిన పరిస్థితిలోకూడా తన దూకుడు ఏమాత్రం తగ్గలేదన్నట్లు నిన్నమొన్నటిదాకా మాట్లాడారు రేవంత్‌రెడ్డి. దాంతో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికారపక్షంపై ఎంతలా విరుచుకుపడతారో అని అంతా భావించారు. కానీ... ఆ అంచనాలన్నీ తలకిందులు చేస్తూ రేవంత్‌రెడ్డి సైలెంట్ అయిపోయారు. అధికారపక్షంపై కనీస విమర్శలు కూడా చేయటం లేదు. తనతో పాటు తెలంగాణ టిడిపిలో మిగిలిన సండ్ర వెంకటవీరయ్యతో కలిసి అసెంబ్లీకి వచ్చామా.. వెళ్లామా.. అన్నట్లుగా కనిపిస్తున్నారు. ఇంతకీ రేవంత్‌రెడ్డి వ్యూహం మార్చుకున్నారా... అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే... ఆయనలో ఈమార్పుకు కారణం స్వంత పార్టీనేతలే అని తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రాకున్నా భారీ మెజార్టీ సాధించకున్నా ఏదో ప్రభుత్వంపై పోరాటానికి అవసరమైనంత స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చావుతప్పి కన్నులొట్టబోయే పరిస్థితికి రావడానికి కారణం రేవంత్‌రెడ్డే అని పార్టీ వర్గాలే ఈసడించుకుంటున్నాయని తెలుస్తోంది.
తెలంగాణ పోరాట యోధునిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌పై రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా కక్షగట్టి, బహిరంగంగా సవాళ్లు చేయడమే తెలుగుదేశం పార్టీ ఈ పరిస్థితికి రావడానికి కారణమైందని.. రేవంత్‌రెడ్డి ముందరే గల్లీస్థాయి లీడర్లు కూడా వేలు చూపిస్తున్నారట. పైపెచ్చు తెలుగుదేశం పార్టీలో తెలంగాణ ప్రజల్లో మిగిలిన కొద్దిపాటి సానుభూతి కూడా కోల్పోవడానికి కారణం రేవంత్‌రెడ్డే అన్న విమర్శలు రావడం, ఆంధ్రా ప్రభుత్వాన్ని, చంద్రబాబును వెనకేసుకురావడానికి తెలంగాణ ప్రయోజనాలను కూడా పక్కకుపెట్టారన్న చెడ్డపేరు తెచ్చుకోవడంతోనే రేవంత్‌రెడ్డి టిడిపికి భస్మాసురహస్తంగా మారిపోయారన్న వ్యాఖ్యలు ఆయన చెవిన పడ్డాయట. దీంతో పార్టీని అభివృద్ధిలోకి తేవడానికి చేసిన పనులు తననే విలన్‌గా మార్చడంతో ఇక తనకెందుకు ఈ అనవసర తలనొప్పులు అని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లను పక్కనబెట్టి మరీ దూకుడుగా వ్యవహరించిన తన పద్దతిని మార్చుకోవాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి రేవంత్‌రెడ్డ ఎగరేసిన ఈ తెల్లజెండా పార్టీల మధ్య యుద్ధాన్ని ఆపేస్తుందా... వేచిచూడాలి.