ఏపి సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి పధంలో దూసుకుపోతోందని తెదేపా నేతలు గొప్పలు చెప్పుకొంటుంటారు. కానీ ప్రచారార్భాటమే తప్ప రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరుగడం లేదని జగన్మోహన్ రెడ్డి వాదిస్తుంటారు. కానీ ఒక్క విషయంలో మాత్రం రాష్ట్రం నెంబర్: 1 స్థానంలో ఉందని జగన్ కూడా అంగీకరిస్తారు. అదే..అవినీతిలో నెంబర్: 1 స్థానంలో ఉందని జగన్ చెపుతుంటారు.
తను ముఖ్యమంత్రి కాకుండా బాబు అడ్డం పాడాడు కాబట్టి ఆయనపై జగన్ కు కోపం, ద్వేషం ఉండటం సహజమే. కానీ తెదేపాకు మిత్రపక్షంగా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భాజపా కూడా జగన్ అభిప్రాయంతో ఏకీభవించడం విశేషం. భాజపా విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మొదటి నుంచి తెదేపాతో న్యూట్రల్ గానే వ్యవహరిస్తున్నారు. మంచయితే మంచని చెడయితే చెడు అని కుండబ్రద్దలు కొట్టినట్లు చెపుతుంటారు.
ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నెంబర్: 1 స్థానం లో ఉంది. అవినీతి ఏ స్థాయికి ఎదిగిపోయిందంటే భోమి కొనాలన్నా అమ్మాలన్నా కూడా లంచాలు ఇవ్వాల్సిందే. లేకుంటే పని జరుగదు. ఎక్కడ చూసిన అవినీతి కనబడుతూనే ఉంది. అవినీతిపరులను పట్టిచ్చిన వారికి ఒక్కొక్కరికీ రూ.10,000 నగదు బహుమతి, ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు వచ్చినప్పుడు అయనతో కలిసి ఫోటో తీసుకొనేందుకు మొదటి 100మందికి అవకాశం కల్పిస్తామని విష్ణు కుమార్ రాజు అన్నారు. తమ ప్రభుత్వంపై మిత్రపక్ష నేత చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్ళు విరుచుకు పడటం ఖాయం. అది ఏ రేంజులో ఉంటుందనేది పాయింట్.