నిన్న జానా నేడు షబ్బీర్..

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ నేతలకు ఎంత చులకన భావం ఉందో వారి మాటలలోనే వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె జానారెడ్డి నిన్న శాసనసభలో మాట్లాడుతూ తెలంగాణా ఇచ్చి పొరపాటు చేశామేమో అని అంటే, ఇవ్వాళ్ళ షబ్బీర్ అలీ మాట్లాడుతూ తెలంగాణా కాంగ్రెస్ పెట్టిన బిక్ష అని చాలా నీచంగా మాట్లాడారు. 

మంత్రి కేటిఆర్ వెంటనే స్పందిస్తూ “ఒకరు తెలంగాణా ఇవ్వడం పొరపాటు అంటారు. మరొకరేమో భిక్ష అంటారు. కానీ తెలంగాణా రాష్ట్రం ఎవరి దయాధర్మాలతో రాలేదు. ఎవరో పెట్టిన బిక్ష కాదు. తెలంగాణా ప్రజలు అందరూ కలిసి పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి సాధించుకొన్న రాష్ట్రం. దాని గురించి కాంగ్రెస్ నేతలు చులకనగా మాట్లాడటం సరికాదు. షబ్బీర్ అలీగారు తన మాటలని ఉపసంహరించుకోవాలి,” అని డిమాండ్ చేశారు. స్పీకర్ మధుసూధనాచారి కూడా అదే సూచించారు. 

ఆ తరువాత అమర వీరుల సంఖ్యపై కూడా వారిరువురి మద్య వాగ్వాదం జరిగింది. దానిపై తెరాస సర్కార్ స్పష్టత లేదని షబ్బీర్ అలీ అంటే, అసలు వారి ప్రాణాలు బలిగొన్న కాంగ్రెస్ పార్టీకి వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కేటిఆర్ వాదించారు. కాంగ్రెస్ చేసిన జాప్యం వలననే అనేకమంది బలిదానాలు చేసుకొన్న సంగతి షబ్బీర్ అలీకి తెలియదా? అని ప్రశ్నించారు. 

అదేవిధంగా రైతుల ఆత్మహత్యలు, వారి కుటుంబాలకు పరిహారం అందించే విషయంలో కూడా తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. కాంగ్రెస్ హయంలో వ్యవసాయాన్ని, సాగునీటి ప్రాజెక్టులను, రైతులను నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు రైతుల కోసం కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారని కేటిఆర్ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం రైతులని ఆదుకోవడానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు వేసిన ప్రశ్నలకు వ్యవసాయశాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ధీటుగా సమాధానాలు చెప్పారు. రైతులకు నష్టం కలిగిస్తున్న నకిలీ విత్తనాల సంస్థలపై చర్యలు తీసుకొంటున్నామని, రైతులకు పావలా వడ్డీ, సబ్సీడీ రుణాలు అందిస్తున్నామని, క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు నిరంతరం పర్యటనలు చేస్తూ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తున్నారని తెలిపారు. 

కాంగ్రెస్ నేతలు మాటలు వింటున్నట్లయితే వారు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను ఉద్దరించామన్నట్లు ఉన్నాయి. వారు మనస్పూర్తిగా ఆ పని సకాలంలో చేసి ఉండి ఉంటే అనేకమంది విద్యార్ధుల ప్రాణాలు కాపాడబడి ఉండేవి. అప్పుడు ప్రజలే కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకొనుండేవారు. కానీ, పదేళ్ళ సుదీర్గ పోరాటాలు పతాక స్థాయికి చేరుకొన్నప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే తమ రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణా ఏర్పాటు చేసింది. అది కూడా సవ్యంగా చేయనే లేదు. రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్ళు పూర్తయినా ఇంతవరకు రాష్ట్రానికి హైకోర్టు లేకపోవడమే యూపియే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.