కేటీఆర్ పాస్‌పోర్టు వ్యవహారం: స్టేటస్ కో!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాస్‌పోర్టు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. 

తెలంగాణ ఏసీబీ అభ్యర్ధన మేరకు ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఆయన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకునేందుకు సిద్ధపడి నోటీసులు జారీ చేసింది. దానిని సవాలు చేస్తూ కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించగా, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ వ్యవహారంలో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 6కు వాయిదా వేసింది.

ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ ఆయన విదేశాలకు వెళ్ళకుండా అడ్డుకునేందుకు పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవలసిందిగా ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని అభ్యర్ధించింది. ఏసీబీ అభ్యర్ధన మేరకు సెప్టెంబర్ 28న పాస్‌పోర్టు కార్యాలయం ఆయనకు నోటీసు జారీ చేసింది. అయితే వ్యక్తిగతంగా హాజరయ్యి తన వాదన వినిపించేందుకు అవకాశం ఇచ్చింది. కానీ కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. 

పాస్‌పోర్టు అధికారుల తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ, కేటీఆర్ పాస్‌పోర్టును నిలిపివేస్తూ ఇప్పటివరకు తుది ఉత్తర్వులు జారీ చేయలేదని కోర్టుకు తెలిపారు. నోటీసుపై తన వివరణ ఇచ్చేందుకు కేటీఆర్‌కు అవకాశం ఉందని పేర్కొన్నారు.

కేటీఆర్‌ తరపు న్యాయవాది వాదనలు కూడా విన్న న్యాయస్థానం, పాస్‌పోర్టు కార్యాలయం  జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కానీ పాస్‌పోర్టు స్వాధీనం లేదా నిలిపివేయడం చేయరాదని తుది తీర్పు వెలువడే వరకు  యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. 

ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి, ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా తమ వాదనలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.