ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ షురూ

తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల కోసం అమలు చేస్తున్న ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. 

కనీసం 18 నుంచి గరిష్టంగా 55 ఏళ్ళ మద్య  వయసున్న మహిళలు వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులకు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలకు పథకంలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. 

అర్హులైన మహిళలు సెప్టెంబర్ 13లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని మీ సేవా కేంద్రాల్లోనూ దరఖాస్తులు సమర్పించవచ్చు. 

ఈ పథకం తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో మిషన్ విలువ రూ.12,000. వాటిని ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది.

కనుక రాష్ట్రంలో అర్హులైన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు, బీసి సంక్షేమశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.