రాష్ట్రంలో ప్రతిపక్షాలది ఎవరి గోల వారిదే అన్నట్లుగా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకొని తెలంగాణా ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకొనే కార్యక్రమం పెట్టుకోగా, రాష్ట్రంలో తెదేపాకి వన్-మ్యాన్-ఆర్మీ వంటి రేవంత్ రెడ్డి పాదయత్రలతో బిజీగా ఉన్నారు. భాజపా నేతలు మోడీ భజనలో తరిస్తూ వచ్చే ఎన్నికలలో ఆయనే మంత్రదండం తిప్పేసి తమని ఒడ్డున పడేస్తారనే గట్టి నమ్మకంతో ఉన్నారు. సిపిఐ కారదర్శి తమ్మినేని వీరభద్రం మహా పాదయాత్రతో ముందుకు సాగిపోతున్నారు. ఈ విధంగా అందరూ ఎవరి గోల వారిదే అన్నట్లు బిజీగా ఉన్నారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం తెరాస సర్కార్ భూసేకరణ చేపట్టినప్పుడు రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ ఒక్కత్రాటిపైకి వచ్చి దానిని గట్టిగా డ్డీ కొని తమ ఉనికిని నిరూపించుకోగలిగాయి. కానీ మళ్ళీ ఇప్పుడు ఎవరి గోల వారిదే అన్నట్లుగా సాగిపోతుండటంతో అవి మళ్ళీ బలహీనపడినట్లు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో అవశేష కాంగ్రెస్ పార్టీతోనే తమకి పోటీ ఉంటుందని మంత్రి కేటిఆర్ స్వయంగా చెప్పడం, రాష్ట్ర కాంగ్రెస్ నేతలకి బహుశః మంచి కిక్క్ ఇచ్చి ఉండవచ్చు. రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ రాజకీయ పరిస్థితులని చూస్తే అది నిజమేనని అర్ధమవుతుంది. తెదేపా, భాజపాలు ఎలాగూ తెరాసకి ప్రత్యామ్నాయం కాలేవు కనుక కాంగ్రెస్ పార్టీయే తెరాసకి ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఆ సంగతి వారూ గ్రహించబట్టే చాలా ధీమాగా మాట్లాడుతున్నారని చెప్పవచ్చు.
కానీ వచ్చే ఎన్నికలలో తెరాస, భాజపాలు చేతులు కలిపే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు గ్రహించారో లేదో? ప్రజలని, ప్రతిపక్షాలని మభ్య పెట్టేందుకే రాష్ట్ర భాజపా నేతలు తెరాస సర్కార్ పై విమర్శలు చేస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్-ప్రధాని నరేంద్ర మోడీల మద్య మంచి బలమైన స్నేహ సంబంధాలే ఉన్న సంగతి కాంగ్రెస్ నేతలు మరిచిపోతున్నారు. ఎన్డీయే కూటమిలో తెరాస భాగస్వామి కానప్పటికీ మోడీ ప్రభుత్వం నిర్ణయాలకి గట్టిగా మద్దతు పలుకుతుండటం, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తుండటం కాంగ్రెస్ పార్టీ గుర్తించే ఉంటుంది కానీ గుర్తించనట్లు నటిస్తూ వచ్చే ఎన్నికలలో తామే అధికారంలోకి వచ్చేయబోతున్నట్లు పగటి కలలు కంటోంది. ప్రతిపక్షాలు వాపుని చూసి బలుపు అని ఆత్మవంచన చేసుకొంటూ పగటి కలలు కంటుంటే తెరాసకేమి అభ్యంతరం? అందుకే వాటిని ఆ భ్రమలో ఉంచే విధంగా వ్యూహాలు అమలుచేస్తూ ముందుకు సాగిపోతోంది.
ప్రతిపక్షాలు చేస్తున్న ఈ పోరాటాల కంటే ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో జరుగుతున్న పోరాటాలకి ప్రజల నుంచి కూడా మంచి స్పందన కనిపిస్తోంది. కనుక ఒకవేళ ఆయన రాజకీయ పార్టీ స్థాపించి వచ్చే ఎన్నికలలో పోటీకి దిగితే, గెలిచినా గెలవకపోయినా తెరాస ఓటు బ్యాంక్ ని చీల్చి తీరని నష్టం కలిగించగలరని ఖచ్చితంగా చెప్పవచ్చు. కనుక తెరాస ప్రతిపక్షాల కంటే ఆయన పట్లే అప్రమత్తంగా మెలగడం చాల మంచిది.