ఎఫ్‌-1 కేసు విచారణ వాయిదా పడింది కానీ...

మాజీ మంత్రి కేటీఆర్‌తో సహా ఎఫ్‌-1 రేసింగ్ కేసులో నిందితులు అందరూ నేడు నాంపల్లి ఏసీబీ కోర్టుకి హాజరయ్యారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఈ కేసు తదుపరి విచారణ ఆగస్ట్ 25కి వాయిదా వేశారు. ఇది ఊహించిందే.

కానీ ఈ కేసులో ఏ-1 ముద్దాయిగా పేర్కొనబడిన కేటీఆర్‌ని లక్ష రూపాయల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తులతో ష్యూరిటీ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా పేర్కొనబడిన అరవింద్ కుమార్‌, బీఎల్ఎన్ రెడ్డి కూడా లక్ష రూపాయల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తులతో ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది. ముగ్గురూ పూచీకత్తు చెల్లించి, ష్యూరిటీ సమర్పించారు. 

ఇటువంటి కేసులలో ఈవిధంగా పూచీకత్తు, ష్యూరిటీ సమర్పించడం సాధారణ విషయమే కావచ్చు. సాధారణంగా అరెస్ట్ అయిన తర్వాత బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానాలు పూచీకత్తు, ష్యూరిటీలు కోరుతాయి. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయకపోయినా పూచీకత్తు, ష్యూరిటీ చెల్లించమని న్యాయస్థానం ఆదేశించడం గమనిస్తే, వారిపై తొలి ఆంక్షలు లేదా షరతులు విధించినట్లే భావించవచ్చు. 

ఈ కేసు విచారణ జరిపిన ఏసీబీ అధికారులు మార్చి 23న కోర్టులో 77 పేజీల ఛార్జ్ షీట్‌ దాఖలు చేశారు. దానిలో కేటీఆర్‌తో ఐదుగురిని నిందితులుగా పేర్కొన్నారు.