ఆగస్ట్ 3వరకు ఎవరూ గాంధీ భవన్‌కి రావద్దు!

తెలంగాణలో ‘సర్’ ప్రక్రియ గడువు ఆగస్ట్ 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. కనుక అది పూర్తయ్యే వరకు కాంగ్రెస్‌ నేతలు ఎవరూ గాంధీ భవన్‌కి రావద్దని సిఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఓ పక్క రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన సర్ ప్రక్రియ సాగుతుంటే పార్టీలో కొందరు నేతలు తమ తమ నియోజకవర్గాలకు వెళ్ళకుండా హైదరాబాద్‌లో కాలక్షేపం చేస్తున్నారని, పదవుల కోసం గాంధీ భవన్‌ చుట్టూ తిరుగుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 

కనుక ఇన్‌ఛార్జ్‌ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ప్రతీ ఒక్కరూ తమతమ నియోజకవర్గాలలో సర్ ప్రక్రియని పర్యవేక్షించాలని ఆదేశించారు. 

ఈ ప్రక్రియలో ఓటర్ల వివరాలు నమోదు చేస్తున్న బీఎల్వోలు ఇచ్చే నివేదికలని నమ్ముకుని కూర్చుంటే నష్టపోతామని, వారు సక్రమంగా వివరాలు నమోదు చేస్తున్నారో లేదో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు.

 ఇప్పుడు అప్రమత్తంగా లేకపోతే మనమే నష్టపోతామని, కనుక కాంగ్రెస్‌ పార్టీలో ప్రతీ ఒక్కరూ దీనిని బాధ్యత తీసుకొని పని చేయాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. మంత్రులైన, ఎమ్మెల్యేలైనా ఎవరైనా ఈ సర్ ప్రక్రియని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కటిన చర్యలు తప్పవని సిఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పదవుల కోసం గాంధీ భవన్‌కు వచ్చే వారికి అపాయింట్మెంట్ ఈయవద్దని సీనియర్ నేతలకు సూచించారు. 

ఈ నెల 30న ఈ ప్రక్రియపై అందరి పనితీరు సమీక్షిస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బాధ్యతగా పనిచేసిన వంద మంది బీఎల్వోలకి రాహుల్‌ గాంధీతో ఫోటోలు దిగేందుకు అవకాశం కల్పిస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.