అక్రమాస్తుల కేసులో భుజంగరావు జైలుకి

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సస్పెన్షన్‌ అయ్యి విచారణ ఎదుర్కొంటున్న అడిషనల్ ఎస్పీ నాయిని భుజంగరావు జైలుకి వెళ్ళక తప్పలేదు. అవినీతి నిరోధకశాఖ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచగా 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు ఆయనని చంచల్ గూడా జైలుకి తరలించారు. 

ఈ కేసులో భుజంగరావు రెండేళ్ళ క్రితమే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. కానీ తర్వాత బెయిల్‌పై  విడుదలయ్యారు. ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఏసీబీ అధికారులు  గుర్తించారు.

నిన్న హఫీజ్ పేటలోని ఆయన నివాసంతో పాటు వనస్థలిపురం, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలోని అయన సమీప బంధువులు బినామీల ఇళ్ళు కలిపి మొత్తం 15 చోట్ల ఏసీబీ అధికారులు ఒకేసారి దాడులు చేశారు.

వారు ఊహించినట్లే సుమారు రూ. 5.92 కోట్లు విలువగల స్థిరచరాస్తులకు సంబందించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి మార్కెట్ విలువ సుమారు వంద కోట్లు వరకు ఉండవచ్చని సమాచారం.

ఆదాయానికి మించి ఉన్న ఆస్తులకు అయన సరైన లెక్కలు ఆధారాలు చూపకపోవడంతో ఆ కేసులో అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.