జయ మేనకోడలు హడావుడి!

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన ఆస్తులకి, రాజకీయాలకి వారసుల పేర్లని నిర్దిష్టంగా ప్రకటించకపోవడం వలన ఒకరొకరుగా వారసులు పుట్టుకొస్తున్నారు. జయలలిత మేనకోడలు దీప ఈరోజు మీడియా ముందుకు వచ్చి తన అత్తయ్యకి శశికళ అంత్యక్రియలు చేయడం తనకి చాలా బాధ కలిగించిందని అన్నారు. ఒక మహిళా అంత్యక్రియలు చేయడం తానెన్నడూ చూడలేదని, ఆమె ఆవిధంగా ఎందుకు చేశారో కానీ అది తప్పని భావిస్తున్నట్లు చెప్పారు. జయత్త మృతి విషయంలో అనేక అంతరంగిక విషయాలున్నాయని త్వరలోనే వాటిని బయట పెడతానని మీడియాతో అన్నారు. 

ఆమె జయలలితకి స్వయాన్న సోదరుడైన జయకుమార్ కుమార్తె. కానీ వారికీ, జయలలిత మద్య చాలా కాలంగా సంబంధాలు, పలకరింపులు, రాకపోకలు లేవు. దీప తన భర్త నుంచి విడిపోయిన తరువాత ఒకటి రెండుసార్లు జయలలితని కలవాలని ప్రయత్నించారు కానీ జయలలిత ఆమెని దరి చేరనీయలేదు. జయలలిత నివసిస్తున్న ‘పొయెస్ గార్డెన్’ భవనం తన తాతగారిదని అది తనకే చెందుతుందని ఆమె వాదించింది. కానీ దాని కోసం ఆమె జయకి వ్యతిరేకంగా కోర్టుకి వెళ్ళే సాహసం చేయలేదు. 

జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమెని కలవాలని దీప మళ్ళీ ప్రయత్నించారు కానీ సెక్యూరిటీ అధికారులు అనుమతించలేదు. మళ్ళీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి హడావుడి చేయడం చూస్తుంటే, ఆమె జయలలిత ఆస్తుల కోసమైనా వచ్చి ఉండాలి లేదా ఆమె రాజకీయ వారసత్వం కోసమైనా ఆరాటపడుతున్నారని అనుమానించక తప్పదు. జయలలితకి రాజకీయ వారసులు చాలా మందే ఉన్నారు కనుక దీప ఆమె ఆస్తుల కోసం ఆశ పడుతున్నారేమో?