అందరికీ ఒకేసారి పవన్ కళ్యాణ్‌ దుమ్ము దులిపేశారుగా

జనసేన పార్టీ అధినేత, ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఈరోజు సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద ప్రెస్‌మీట్‌ పెట్టి తెలంగాణ పార్టీలను, వాటి నేతలను దుమ్ము దులిపేశారు. ప్రెస్‌మీట్‌లో అయన మాట్లాడిన ముఖ్యాంశాలు: 

తెలంగాణ ప్రజలకు నేనేమిటో తెలుసు. కనుక నన్ను ప్రశ్నించే ఈ నాయకులను నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. 

తెలంగాణపై ప్రేమ ఈరోజు పుట్టుకొచ్చినది కాదు. మీరు పట్టించుకోని ప్రజలను, కళాకారులను, భాష, యాస, సంస్కృతి, పండుగలు, పబ్బాలు ప్రతీదీ నేను స్వయంగా కలిశాను. చూశాను. నా సినిమాలు, రాజకీయ ఆలోచనలలో ప్రతిభింబించేలా చేస్తూనే ఉన్నాను. 

గద్దర్ అన్నతో పరిచయం ఈనాటిది కాదు. ఖుషీ సినిమా తర్వాత మొదలై, అయన అంతిమ ఘడియల వరకు సాగింది. చివరి నిమిషంలో కూడా అయన నా పేరిట ఒక లేఖ, ఒక ఆడియో ఫైల్ చేసిచ్చారు. కానీ ఇంతవరకు ఏనాడూ వాటి గురించి ఎవరికీ చెప్పలేదు. 

నేను తెలంగాణలో ఎలా అడుగుపెడతానో చూస్తానని ఒకరు సవాలు చేశారు. ఇదేమైనా మీ అయ్యా జాగీరా ఎవరు రావాలో ఎవరు రాకూడదో నిర్ణయించడానికి? 

ఇప్పటివరకు నేను అనుకోలేదు. కానీ ఇప్పుడే నిర్ణయించుకున్నాను. ఇకపై తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటాము. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యపై ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాము. ఎన్నికలలో పోటీ చేస్తాము. ఎవరు అడ్డుకుంటారో మేము చూస్తాము. 

ఒకవేళ తెలంగాణలో నేను అడుగుపెట్టకూడదని మీరనుకుంటే శాసనసభలో తీర్మానం చేయండి చూద్దాం. 

తెలంగాణ నా భారతదేశంలో అంతర్భాగం. కనుక ఇక్కడ నన్ను అడ్డుకునే హక్కు మీకే లేదు. గుర్తుంచుకొండి.