నేను ఒక్కసారి చెప్తే వెయ్యిసార్లు చెప్పినట్లే: కేసీఆర్‌

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ పార్టీ రజతోత్సవాలు ముగింపు సభలో ఆ ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 

అయన ప్రసంగంలో ముఖ్యాంశాలు: 

రాష్ట్ర కార్యవర్గం తప్ప మిగిలిన అన్ని కార్యవర్గాలు రద్దు. రెండు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తాం. బీఆర్ఎస్‌ పార్టీ నాయకులందరూ తప్పనిసరిగా సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలి. 

ప్రజల మధ్యకు వెళ్ళకుండా సోషల్ మీడియాలో కనిపిస్తామంటే కుదర్దు. పని చేయనివారికి టికెట్స్ ఇవ్వను. వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా సరే! నేను ఒక్కసారి చెప్తే వెయ్యిసార్లు చెప్పినట్లే!

పార్టీలో కొందరు నేతలు నేటికీ చాలా అహంకారంతో వ్యవహరిస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలి. ఇక నుంచి ఫామ్‌హౌసులో నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్య నేతలతో అన్ని అంశాలను సమీక్షిస్తాను. సభ్యత్వ నమోదు తర్వాత మళ్ళీ కొత్త కార్యవర్గాలను ఏర్పాటు చేసుకుందాము.   

పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసినా, 60 లక్షల మంది సభ్యులున్నా ఎందుకు ఓడిపోయామో పార్టీలో ప్రతీ ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి.

పదేళ్ళపాటు మనం రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నరేళ్ళలో నాశనం చేసింది. కనుక తెలంగాణ పునర్నిర్మాణం కొరకు ముందుగా మనం బలోపేతం అవ్వాలి. విద్యార్ధి సంఘాలతో సహా అనుబంద సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి. కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారు. మార్పు కోరుకుంటున్నారు. ఈసారి ఎన్నికలలో మనమే గెలుస్తాం... వంద కాదు వెయ్యి శాతం నాదీ గ్యారెంటీ!

మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బిజేపి మోసపూరితంగా వ్యవహరించి దేశంలో మహిళలకు అన్యాయం చేసింది. దీనికి బిజేపి మూల్యం చెల్లించుకోక తప్పదు. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ సభలో చక్కగా మాట్లాడారు. 

తెలంగాణ ఏర్పాటు గురించి బిజేపి నేతలు మొదటి నుంచి తప్పుగానే మాట్లాడుతున్నారు. తెలంగాణ పట్ల వారికి అభిమానం లేదు. బిజేపి ఎంపీ తేజస్వీ సూర్య లోక్‌సభలో ఆవిధంగా మాట్లాడుతుంటే మన కాంగ్రెస్‌ ఎంపీలు కనీసం స్పందించలేదు. త్వరలో తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం మొదలవబోతోంది. ఆ సాకుతో మన పార్టీ ఓటర్ల పేర్లు తొలగించకుండా అందరూ జాగ్రత్త పడాలి,” అని కేసీఆర్‌ అన్నారు.