
ప్రధాని మోడీ వచ్చే నెల 9న హైదరాబాద్ రాబోతున్నారు. ఆ రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర బిజేపి అధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగబోతోంది. దానిలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు, అదే వేదికపై నుంచి వర్చువల్ పద్దతిలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ టెక్స్ టైల్ పార్కుని ప్రారంభిస్తారు.
అలాగే బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్లో కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనాలను, ములుగులోని సమ్మక్క-సారలమ్మ విశ్వవిద్యాలయం, ఖమ్మం-దేవరాపల్లి గ్రీన్ సిగ్నల్ ఫీల్డ్ జాతీయ రహదారిని కూడా ప్రధాని మోడీ ప్రారంభిస్తారు.
కేసీఆర్ జగిత్యాల సభతో ప్రజల ముందుకు రావడం, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడంతో రాష్ట్ర రాజకీయాలలో మళ్ళీ వేడి పెరిగింది.
మే 4 నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వస్తుండటం యాదృచ్చికమే కావచ్చు. కానీ ఒకవేళ బిజేపి ఆశపడుతున్నట్లు, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అధికారంలోకి రాగలిగితే, హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ విమర్శలు మరింత పదునెక్కుతాయి.
ఆ రెండు రాష్ట్రాలలో లేదా కనీసం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గెలిచినా బిజేపి తదుపరి టార్గెట్ తెలంగాణ కావచ్చు. కనుక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకి రాజకీయంగా కూడా కీలకంగా మారే అవకాశం ఉంది.