ఏప్రిల్‌ మొదటి వారంలో యాదాద్రికి ఎంఎంటిఎస్ శంకుస్థాపన

ప్రధాని మోడీ ఏప్రిల్‌ మొదటి వారంలో హైదరాబాద్‌కు రాబోతున్నారు. తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు ప్రధాని మోడీ హైదరాబాద్‌ వస్తున్నారు.

బిజేపి అధ్వర్యంలో హైదరాబాద్‌లో జరుగబోయే బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఆ వేదిక నుంచే సికింద్రాబాద్‌ నుంచి యాదాద్రి చేరుకునేందుకు దక్షిణ మద్య రైల్వే స్టేషన్‌ ప్రతిపాదించిన ఎంఎంటిఎస్ రైల్వే లైన్‌ నిర్మాణ పనులకు, అవుటర్ రింగ్ రోడ్ (నార్త్) పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు.   

బీబీ నగర్‌ ఎయిమ్స్ హాస్పిటలలో కొత్తగా నిర్మించిన బ్లాకులను, రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన జాతీయ రహదారులను వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు చేస్తారు. 

ప్రధాని మోడీ చివరిసారిగా 2024 మేలో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రానికి వచ్చారు. అంటే దాదాపు రెండేళ్ళయిందన్న మాట! కనుక రాష్ట్ర బిజేపి నేతలు ప్రధాని మోడీ పర్యటనకి అట్టహాసంగా ఏర్పాట్లు చేసి, లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ ఖరారు కాగానే చకచకా ఏర్పాట్లు పూర్తిచేసేందుకు ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.