రాజ్యసభ రెండు సీట్లకు అరడజను మంది పోటీ?

తెలంగాణ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యులు అభిషేక్ సింఘ్వీ, కేఆర్ సురేష్ రెడ్డిల పదవీ కాలం ఏప్రిల్‌ నెలతో ముగుస్తుంది. ఈ రెండు స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో మరో 35 సీట్లు ఖాళీ అవుతున్నందున కేంద్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. నామినేషన్ గడువు మార్చి5 వరకు ఉంది. పోలింగ్ మార్చి 16న జరుగుతుంది. ఎక్కువ సమయం లేదు కనుక అప్పుడే కాంగ్రెస్‌ పార్టీలో పలువురు సీనియర్లు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 

వారిలో సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ కూడా ఉన్నారు. మళ్ళీ తనకే మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి, సీనియర్ నేతలు జీవన్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, కే కేశవరావు, వి హనుమంతరావు, వేం నరెందర్ రెడ్డి ఇంకా మరికొందరు రాజ్యసభ సీటు ఆశిస్తున్నట్లు సమాచారం. 

రెంటిలో ఒకటి సుదర్శన్ రెడ్డికి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్స్ వేసేందుకు ఎక్కువ సమయం లేదు కనుక త్వరలోనే కాంగ్రెస్‌ అధిష్టానం అభ్యర్ధులను ఖరారు చేసి అధికారిక ప్రకటన చేయక తప్పదు.