
శుక్రవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రూప్-3 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులను సిఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాననే నమ్మకం నాకుంది. కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు తదితర వివిధ వర్గాల ప్రజలను పట్టించుకోకుండా తన కుటుంబం, తన పార్టీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కనీసం ఉద్యోగాల భర్తీ ప్రక్రియని కూడా సక్రమంగా నిర్వహించలేదు.
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంటనే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి రెండేళ్ళలోనే గ్రూప్-1, 2,3 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చము. భర్తీ ప్రక్రియని చాలా పారదర్శకంగా, శరవేగంగా పూర్తిచేశాము. కేవలం 55 రోజులలోనే డీఎస్సీ ప్రక్రియని పూర్తి చేసి 11,000 మందికి నియామక పత్రాలు అందించాము,” అన్నారు.
కేసీఆర్ ఫామ్‌హౌసు రాజకీయాలపై సిఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఆయన రాక్షస గురువు శుక్రాచార్యుడులా నీచ రాజకీయాలు చేస్తున్నారు. మారీచ సుభాహుల్లాగా బావాబామర్దులను మా ప్రభుత్వంపైకి ఉసిగోల్పుతూ ప్రతీ పనికి అడ్డుపడుతున్నారు.
ఆయనకున్న రాజకీయ, పరిపాలనానుభవం ఉంది గనుక శాసనసభకు వచ్చి మా ప్రభుత్వం చేస్తున్న తప్పొప్పులను వివరించి నిర్మాణాత్మకమైన సూచనలు ఇవాలి. వద్దనుకుంటే ఫామ్‌హౌసు బుద్దిగా పడుకోవాలి. అంతేకానీ ఇలా ఫామ్‌హౌసు రాజకీయాలు చేస్తూ ప్రతీ పనికీ అడ్డుపడుతుండటం తగదు,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.