
నేడో రేపో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతుంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఊహించని విషయం చెప్పారు. రాష్ట్రంలో మొత్తం అన్నిటికీ ఇప్పుడు ఎన్నికలు జరుపబోవడం లేదని కేవలం పాలకవర్గం గడువు ముగిసిన మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించబోతున్నామని తెలిపారు. ఖమ్మం తదితర మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు తర్వాత నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు తుది ఓటర్ల జాబితా ఇటీవలే విడుదల చేసింది. దాని ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్స్ ఖరారు చేయగానే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది.
పంచాయితీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 50 శాతం పైగా సీట్లు సాధించినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ కూడా 25 శాతం పైనే సీట్లు సాధించింది. కనుక మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ అటువంటి అవకాశం ఇవ్వబోమని కాంగ్రెస్ పార్టీ చెపుతోంది. కనుక రెండు పార్టీలకు మున్సిపల్ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి.