
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికుల రుణ మాఫీ పధకం కోసం రూ.16.28కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 బడ్జెట్లో ఈ పధకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించింది. కానీ జౌళిశాఖ అధికారులు సర్వే చేయగా ఇంకా చాలా మంది చేనేత కార్మికులు బ్యాంకుల వద్ద నుంచి రుణాలు తీసుకున్నారని తెలుసుకున్నారు. వారి రుణాలు కూడా కలిపి లెక్క కడితే మొత్తం రూ.48.30 కోట్లు అని తేలింది. ఈ వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దాని ఆధారంగా ప్రభుత్వం మరో రూ.16.28కోట్లు కేటాయించింది. రాష్ట్ర వాణిజ్య, జౌలిశాఖల ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.