
ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ 'ఆరా మస్తాన్' అధినేత ఆరా మస్తాన్ నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గతంలో కూడా ఓసారి ఇదే కేసులో ఆయనని ప్రశ్నించారు. నేడు సుమారు రెండున్నర గంటలసేపు ప్రశ్నించి ఆయన చెప్పిన వివరాలన్నీ నమోదు చేసుకున్నారు.
అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ, “ఇదివరకు విచారణకు పిలిచినప్పుడు అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడిగారు. నాకు తెలిసినంతవరకు చెప్పాను. 2020లో నా రెండు ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. ఆ వివరాలను కూడా ఎదురుగా పెట్టి మళ్ళీ వాటి గురించి ప్రశ్నించారు.
ఈ కేసులో ప్రభాకర్ రావుని ప్రశ్నించి కొన్ని వివరాలు రాబట్టారు. వాటిని క్రాస్ చెక్ చేసుకునేందుకే మళ్ళీ నన్ను పిలిపించారని వారి ప్రశ్నల ద్వారా అర్దమైంది,” అని ఆరా మస్తాన్ చెప్పారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు అధికారులతో సహా కేసీఆర్ హయంలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులను సిట్ అధికారులు ప్రశ్నించి వివరాలు సేకరించారు. అధికారులని ప్రశ్నించడం పూర్తయింది.
కనుక త్వరలోనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు పంపించే విచారణకు పిలిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 3వ తేదీన తనకు నోటీస్ ఇవ్వబోతున్నట్లు హరీష్ రావు స్వయంగా చెప్పుకున్నారు.