రాజ్ భవన్‌ ఇకపై లోక్‌ భవన్‌

తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసమైన ‘రాజ్ భవన్‌’ పేరుని ‘లోక్‌ భవన్‌’గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ‘రాజ్ భవన్‌’, ‘రాజ్ నివాస్’ వంటి పేర్లు అలనాటి రాచరిక పోకడలను, వలసవాదుల పాలనని గుర్తు చేస్తున్నట్లున్నాయి. ప్రజాస్వామ్యదేశమైన భారత్‌లో అటువంటి పేర్లు అనుచితంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 

కనుక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ‘రాజ్ భవన్‌’ పేరుని ‘లోక్‌ భవన్‌’గా మార్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు కేరళ, తమిళనాడు, ఒడిశా, గుజరాత్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం రాష్ట్రాలు ఈ మార్పు చేశాయి. నేడు తెలంగాణ ప్రభుత్వం కూడా ‘రాజ్ భవన్‌’ పేరుని ‘లోక్‌ భవన్‌’గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

‘రాజ్ భవన్‌’ పేరుని ‘లోక్‌ భవన్‌’గా మార్చడం బాగానే ఉంది. కానీ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో  గవర్నర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాజకీయ చదరంగం ఆడుతుంటుంది. మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలలో ఈవిధంగానే అధికార మార్పిడి జరిగింది. 

ప్రజస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను ‘రాజ్ భవన్‌’లోని గవర్నర్ల ద్వారా తారుమారు చేస్తున్నప్పుడు కేవలం పేరు మార్పు వలన కొత్తగా ఒరిగేదేమి ఉంటుంది? ప్రజాస్వామ్యస్పూర్తిని కాపాడటానికి ‘రాజ్ భవన్‌’ కృషి చేసినప్పుడే ఈ కొత్త పేరు సార్ధకం అవుతుంది.