
హైదరాబాద్, పాత బస్తీలో సోమవారం రాత్రి సుమారు 10.30 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. శాలిబండ క్లాక్ టవర్ పక్కనే ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్ షాపు సిబ్బంది నిన్నరాత్రి మూసివేస్తున్నప్పుడు హటాత్తుగా లోపల నుంచి మంటలు మొదలయ్యాయి.
ఆ మంటలు లోపల ఉన్న టీవీలు, ఫ్రిజ్జులకు వ్యాపించడంతో అవి భారీ శబ్దంతో దీపావళి బాంబుల్లా పేలిపోయాయి. ఆ ధాటికి షాప్ షట్టర్ ఊడిపడి వంద మీటర్ల దూరంలో పడింది.
ఈ ప్రమాదం జరిగినప్పుడు షాపు బయట సీఎన్జీ కారు పార్క్ చేసి ఉండటంతో దానిలో మంటలు వ్యాపించి అదీ పెద్ద శబ్దంతో పేలిపోయింది. దాని పక్కనే ఉన్న మరో బైక్‌కి మంటలు వ్యాపించి అదీ పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి ఘటనా స్థలంలోనే చనిపోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల సేపు శ్రమించి మంటలు పూర్తిగా ఆర్పివేశారు. మొఘల్ పురా పోలీసులు చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించి అటువైపు వాహనాలు వెళ్ళకుండా నియంత్రిస్తూ అగ్నిమాపక సిబ్బందికి సహకరించారు.
ఈ ప్రమాదానికి కారణం తెలియవలసి ఉంది. బహుశః షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రెండు కోట్లు విలువగల టీవీలు, ఫ్రిజ్జులు, వాషింగ్ మెషిన్లు తదితర గృహోపకరణాలు కాలిబూడిదైపోయాయని సమాచారం.