నాంపల్లి వైపు వెళుతున్నారా? రద్దీగా ఉండవచ్చు!

అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై ఉన్న వారి అధినేత, ఏపీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు నాంపల్లి సీబీఐ కోర్టుకి హాజరు కాబోతున్నారు. కనుక నేడు నాంపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ శ్రేణుల హడావుడి ఉంటుంది.

ఇటీవల అయన కోర్టు అనుమతి తీసుకొని యూరప్ పర్యటనకు వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత నవంబర్‌ 14లోగా స్వయంగా కోర్టుకు హాజరవుతానని హామీ ఇచ్చారు. ఆయన యూరప్ నుంచి తిరిగి వచ్చి అప్పుడే రెండు నెలలు అవుతోంది. కానీ ఇంతవరకు హాజరు కాలేదు. 

తాను నాంపల్లి కోర్టుకి వస్తే భారీగా భద్రత కల్పించాల్సి ఉంటుందని, అది ప్రభుత్వానికి భారమవుతుంది కనుక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని కోర్టుని అభ్యర్ధించారు. కానీ కోర్టు అందుకు అంగీకరించకపోవడంతో నేడు స్వయంగా విచారణకు హాజరవుతున్నారు. 

రాష్ట్ర విభజన జరుగక మునుపు సీబీఐ జేడీ లక్ష్మినారాయణ దర్యాప్తు జరిపి, ఆయనపై 11 అక్రమాస్తుల కేసులు నమోదు చేశారు. ఆ కేసులలో జగన్‌, విజయసాయి రెడ్డి, పలువురు రాజకీయ నాయకులు, ఐఏఎస్‌ అధికారులు చంచల్‌గూడా జైల్లో 16 నెలలు గడిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అందరూ బెయిల్‌పై బయటకు వచ్చేశారు. 

ఆ కేసుల విచారణ నేటికీ కొనసాగుతోంది. ఈలోగా జగన్‌ ఓసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆ కేసులలోనే జగన్‌ నేడు సీబీఐ కోర్టు ఎదుట స్వయంగా హాజరు కాబోతున్నారు. 

కనుక అయనకు జేజేలు పలికేందుకు భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు నాంపల్లికి తరలివస్తారు. నాంపల్లి పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసులను మొహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు విచారణ ముగిసిన తర్వాత జగన్‌ హైదరాబాద్‌ నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళబోతున్నట్లు సమాచారం.