స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు షురూ

బీసీ రిజర్వేషన్స్‌ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టత ఈయడంతో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు కసరత్తు ప్రారంభించింది. కోర్టు ఆదేశం మేరకు పాత రిజర్వేషన్స్‌ ప్రకారం సీట్లు కేటాయింపు జేసి, పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించింది.

ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీలలో ఓటర్ల జాబితా మరోసారి సవరణకు రేపు (గురువారం) నుంచి సోమవారం వరకు ఓటర్ల జాబితాలు  సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ పంచాయితీలకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం రిజర్వేషన్స్ ఖరారు చేసి ప్రకటిస్తుంది. దాని ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి నిర్వహిస్తుంది.

ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సిద్దపడినప్పటికీ, బీసీ రిజర్వేషన్స్‌, దాని కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్స్ దాఖలు అవడంతో ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఈసారి ఎటువంటి అవాంతరాలు లేవు కనుక డిసెంబర్‌ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.