
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఏటా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఆపేయడంతో బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తూనే ఉంది. ఏటా బతుకమ్మ చీరలు అందుకున్న మహిళలు కూడా నిరాశ చెందుతున్నారు.
కనుక ఇక నుండి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏటా “మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద కోటి మంది మహిళలకు ‘ఇందిరా మహిళా శక్తి’ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సచివాలయంలో జరిగిన సమావేశంలో దీని గురించి చర్చించి లాంచనంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. చీరల పంపిణీ కార్యక్రమం కొరకు ఒక్కో నియోజకవర్గానికి ఓ అధికారికి బాధ్యత అప్పగించి, ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మహిళా సంఘాలు తయారుచేసే ఉత్పత్తులను శిల్పారామంలో ‘ఇందిరా శక్తి బజార్’లో స్టాల్స్ కేటాయించి మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అలాగే మహిళా సంఘాలు అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ప్రభుత్వం ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది.
ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.