మొదట తుమ్మలని, తర్వాత నన్ను... వెరీ బ్యాడ్!



జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీ ఓటమి తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శల జోరు పెంచారు. ‘జాగృతి జనం బాట’లో భాగంగా ఖమ్మంలో పర్యటిస్తున్నప్పుడు బీఆర్ఎస్‌ పార్టీపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 

“తుమ్మల నాగేశ్వర రావు వంటి అత్యంత సీనియర్, రాజకీయ అనుభజ్ఞుడుని వదులుకొని బీఆర్ఎస్‌ అధిష్టానం అతిపెద్ద పొరపాటు చేసింది. అప్పటికే పలువురు సీనియర్లు పార్టీకి దూరమయ్యారు. తుమ్మల కూడా వెళ్ళిపోవడంతో పార్టీ పతనం తప్పదనే భావన ప్రజలలో ఏర్పడింది. ఇంకా అనేక ఇతర కారాణాలతో ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. 

అప్పుడు ఆయనని వదులుకున్న బీఆర్ఎస్‌ పార్టీ, దాని కోసం 20 ఏళ్ళు కష్టపడి పనిచేసిన నన్ను కూడా ఇప్పుడు అవమానకరంగా బయటకు గెంటేసింది. పార్టీలో కేసీఆర్‌ కూతురికే ఈ దుస్థితి నెలకొని ఉంటే మిగిలినవారి పరిస్థితి ఏమిటి? అని ప్రజలు ఆలోచించకుండా ఉంటారా?

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్‌ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడలేకపోతోంది. కనీసం ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించలేకపోతోంది. కనుక తెలంగాణ జాగృతి ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటుంది. రాజకీయాలు చేసేందుకు పార్టీయే స్థాపించనవసరం లేదు.

అంత రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్‌ నాయకత్వంలో నడుస్తున్న బీఆర్ఎస్‌ పార్టీ దయనీయ పరిస్థితిని చూస్తున్నప్పుడు, అంత అనుభవం లేని నేను పార్టీ స్థాపనకు తొందరపడటం మంచిది కాదని గ్రహించాను. ఒకవేళ పార్టీ స్థాపించేమాటయితే హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి ఢంకా బజాయించి మరీ చెప్తాను,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.