4.png)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ ఉప ఎన్నికలో మేము ఓడిపోయాము. కనుక సాకులు వెతకాలనుకోవడం లేదు. ఆత్మ విమర్శ చేసుకొని లోపాలు సరిదిద్దుకొని ముందుకు సాగుతాం.
గత రెండేళ్ళుగా ప్రతిపక్ష పార్టీగా మేము చాలా సమర్ధంగా పనిచేస్తున్నాము. ఇక ముందు కూడా అలాగే పనిచేస్తాము. కేసీఆర్‌ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసే వరకు ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటాము.
ఈ ఉప ఎన్నిక పార్టీలో కొత్త ఉత్సాహం నింపింది. పార్టీ నేతలందరూ యధాశక్తిన పనిచేశారు. మాగంటి సునీతకి రాజకీయాలు కొత్త. కానీ ఆమె కూడా చాలా గొప్పగా పోరాడారు. ఈ ఉప ఎన్నికలో మేము చాలా నిజాయితీ పోరాడాము.
కానీ ఎన్నికలు ఏ విధంగా జరిగాయో అందరూ చూశారు. ప్రచారం ముగిసే వరకు ఒకవిధంగా, ముగిసిన తర్వాత మరో రకంగా జరిగాయి. వాటి గురించి అందరికీ తెలుసు. కనుక ఇప్పుడా విషయాలు నేను మాట్లాడను.
ఈ ఉప ఎన్నిక మాకు చిన్న ఎదురు దెబ్బ మాత్రమే. కానీ కాంగ్రెస్ పార్టీకి బిహార్‌లో చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరూ దాని గురించి మాట్లాడటం లేదు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తప్పక అనర్హత వేటు వేయాల్సిందే. అప్పుడు ఒకేసారి 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ ఉప ఎన్నికని ఎదుర్కోలేక తెలంగాణ కాంగ్రెస్ నానా తిప్పలు పడింది. రేపు 10 స్థానాలలో ఎన్నికలు జరిగితే ఏం చేస్తారో... మమ్మల్ని ఎలా ఎదుర్కొంటారో? ప్రచారానికి సోనియా, రాహుల్ గాంధీలను తెచ్చుకోవాలేమో?” అని కేటీఆర్ అన్నారు.