బీహార్‌ ఎన్నికల ఫలితాలు నేడే

బీహార్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలు నేడే వెలువడబోతున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. ఆనవాయితీ ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలను తెరిచి ఓట్లు లెక్కిస్తారు. 

బీహార్‌ శాసనసభలో మొత్తం 243 స్థానాలు ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకి కనీసం 122 సీట్లు గెలుచుకోవలసి ఉంటుంది. ఈ ఎన్నికలలో మళ్ళీ ఎన్డీయే గెలుస్తుందని సర్వే సంస్థలన్నీ తేల్చి చెప్పేశాయి. 

కానీ కాంగ్రెస్‌-ఆర్‌జేడిల మహా ఘాట్ బంధన్ (కూటమి) మహిళలకు నెలకు రూ.2,500 పించన్, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ చేస్తామని, ఇంటికో ప్రభుత్వోద్యోగం ఇస్తామంటూ ఆకర్షణీయమైన హామీలు ఇచ్చింది. 

అలాగే బీహార్‌లో భారీగా ఓట్లు దొంగతనం  జరిగిందని, బీహారీలు వలసలు పోక తప్పడం లేదంటూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ భారీగా ప్రచారం చేసింది. కనుక ఈ హామీలు, ప్రచారాస్త్రాలే ఈ ఎన్నికలలో తమని గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. 

ఇక దేశంలో కాంగ్రెస్‌, బీజేపిలతో సహా అనేక ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా చేసి వాటన్నిటినీ గెలిపించిన ప్రశాంత్ కిషోర్‌ సొంతంగా జన్ సూరజ్ పార్టీ పెట్టుకొని తొలిసారిగా ఈ ఎన్నికల బరిలో దిగారు. కానీ ఆయన పార్టీకి 10 లోపే సీట్లు వస్తాయని సర్వేలన్నీ తెల్చిచేప్పేశాయి. 

కనుక పోటీ ప్రధానంగా కాంగ్రెస్‌-బీజేపి కూటమి మద్య సాగింది. వీటిలో ఏది గెలుస్తుందో మరి కొన్ని గంటలలో తెలుస్తుంది.