కాంగ్రెస్‌ కామారెడ్డి సభ వాయిదా!

కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించాలనుకున్న బీసీ డిక్లరేషన్ సభని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నందున ఈ సభని వాయిదా వేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. వాతావరణం కాస్త కుదుట పడగానే ఈ సభని మళ్ళీ ఎప్పుడు నిర్వహించబోయేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.  

తెలంగాణ ప్రభుత్వం పంచాయితీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణ చేసి రిజర్వేషన్స్‌ గరిష్ట పరిమితి 50 శాతంని రద్దు చేసింది. శాసనసభ ఆమోదించిన ఈ బిల్లుని తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమోదం తెలిపారు. బీసీ రిజర్వేషన్స్‌కి లైన్ క్లియర్ అయ్యింది కనుక ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించాలనుకుంది. కానీ వర్షాల కారణంగా రద్దు చేసుకోవలసి వచ్చింది. 

బీసీ రిజర్వేషన్స్‌ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ముందడుగు వేయగలిగినప్పటికీ, యూరియా సరఫరా విషయంలో రైతుల ఆగ్రహానికి గురవుతోంది. దీనిని బీఆర్ఎస్‌ పార్టీ అనుకూలంగా మార్చుకొని ప్రతీరోజూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది.

కనుక త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్స్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తాయా లేదా యూరియా కొరత బీఆర్ఎస్‌ పార్టీని గెలిపిస్తుందో చూడాలి.