కవిత జైలుకి నేను బయటకి: కడియం

కల్వకుంట్ల కవితని బీఆర్ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ఆనాడు కల్వకుంట్ల కవితని లిక్కర్ కేసులో అరెస్ట్‌ చేసినప్పుడే నాకు పార్టీలో ఉండాలనిపించలేదు. కేసీఆర్‌ కూతురు అవినీతి కేసులో అరెస్ట్‌ అయ్యి జైలుకి వెళితే కేసీఆర్‌ ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఆమెను వెనకేసుకు వచ్చారు. ఆమెకు అండగా నిలబడ్డారు. తద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. నేను బీఆర్ఎస్‌ పార్టీని వీడటానికి ఇదీ ఓ కారణమే,” అని అన్నారు. 

అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం విచారణ కూడా జరిపించకుండా తాటికొండ రాజయ్యని, ఈటల రాజేందర్‌ని పదవులలో నుంచి తొలగించారు. కానీ కూతురు కవిత జైలుకి వెళ్ళినా, ఫార్ములా-1 రేసింగ్ కేసులో కొడుకు జైలుకి వెళ్ళే పరిస్థితి ఏర్పడినా కేసీఆర్‌ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా పార్టీ తరపు పూర్తి మద్దతు లభించేలా చేశారు. ఇది అన్ని పార్టీలలో సర్వసాధారణమే. కానీ రాజయ్య, ఈటల విషయంలో అంత కటినంగా వ్యవహరించినప్పుడు కొడుకు, కూతురు విషయంలో మాత్రం ఎందుకు అంతగా ఉపేక్షించారు? పైగా వారి కోసం బీఆర్ఎస్‌ పార్టీని బీజేపిలో విలీనం చేసేందుకు కూడా కేసీఆర్‌ సిద్దపడ్డారు కదా? కడియం శ్రీహరి ఇదే అడిగారు.